ఇంట్లో టెన్త్ పాసైంది నేనే అంటున్న హీరో

ముంబై : నేను హీరో అవుదామనుకున్నది.... సినిమాలంటే మోజుతో తీసుకున్న నిర్ణయం కాదు... చదువు మీద ఇష్టం లేకపోవడం వల్ల బలవంతాన కలిగిన ఆసక్తి! ఇదే మాట అమ్మకి చెప్పాను. 'సరే... కానీ చదువు మాత్రం ఆపొద్దు' అని ట్విస్ట్‌ ఇచ్చింది! నాకు ఆనందాన్నిచ్చిన విషయం ఏంటంటే... ఆ తరువాత తక్కువ మార్కులు వచ్చినా ఇంట్లో ఏమీ అనేవారు కాదు అంటూ తన గతం విప్పారు రణబీర్ కపూర్. బాలీవుడ్ ని ఏలుతున్న ఈ యంగ్ హీరో తన మనస్సులో మాటలు ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే... ఖాళీగా ఉన్నప్పుడల్లా నాన్న హీరోగా నటించిన సినిమాలు చూసేవాణ్ని. విద్యాపరంగా చూసుకుంటే నేను సాధించిన విజయం మాత్రం ఒకటుంది! ఆరోజు నాకు ఇంకా గుర్తుంది. పదో తరగతి ఫలితాలు వచ్చాయి. రిజల్ట్స్‌ రోజున నా నంబర్‌ పేపరులో ఉండాలని అమ్మ ఎన్నో పూజలు చేసింది. మొత్తానికి పేపర్లో నంబరు కనిపించింది. అమ్మ ఎంతో ఆనందంతో నాన్నకి ఫోన్‌ చేసింది. ఆయన షూటింగ్‌ కోసం న్యూయార్క్‌లో ఉన్నారు. గంటలో కపూర్‌ కుటుంబం మొత్తం నన్ను తెగ మెచ్చుకోవడం ప్రారంభించారు.

'మా వాడు టెన్త్‌ పాసయ్యాడని' ఎంతో గొప్పగా అందరికీ ఫోన్లు చేసి చెప్పేశారు. ఇంతకీ అప్పుడు నాకొచ్చిన మార్కుల శాతం ఎంతో తెలుసా... 53.4. ఈమాత్రం దానికి అంత సంబరం అవసరమా అనేగా మీ ప్రశ్న. మా కుటుంబంలో ఒకసారైనా ఫెయిల్‌ కాకుండా టెన్త్‌ పాసైన మొదటివాడిని నేనే. అందుకే అంత సంబరం. ఆపై ఎలాగోలా 12వ తరగతి వరకూ చదివేశాను. ఆ తరువాత చలో అమెరికా అన్నారు.

'నువ్వు బాగా చదువుకోవాలి. రేపట్నుంచీ కరాటే గిరాటే బంద్‌' అంది. ఏం చేయడం..? నాకు అత్యంత బద్ధకమైన పనేదైనా ఉందీ అంటే అది చదువే. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించేవాణ్ని. అప్పుడప్పుడూ తాతగారితో కలసి షూటింగులకి వెళ్తుండటం అలవాటే. అయితే, అక్కడికి వెళ్లాక ఆడుకోవడమేగానీ ఆయనేం చేస్తున్నారూ అసలు సినిమా ఎలా తీస్తారూ ఇలాంటివేవీ పట్టించుకునేవాణ్ని కాదు. ఓసారి ఆ ఆసక్తీ కలిగింది.

ఏడో తరగతిలో ఉండగానే అనుకుంటా... ఇంతకీ ఈ సినిమా ఎలా తీస్తారో తెలుసుకుందాం అన్న కుతూహలం మొదలైంది. షూటింగ్‌ స్పాట్‌కి వెళ్లాను. ఆరోజు హీరో హీరోయిన్లపై పాట చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్‌కి బాగా మేకప్‌ పూసి భారీగా నగలు వేశారు. అవి మోయలేక ఆమె నానా తంటాలూ పడుతోంది. తీసిన షాట్‌నే పదేపదే తీస్తున్నారు. చేసిన డాన్సునే మళ్లీమళ్లీ చేయిస్తున్నారు. చూసీచూసీ నాకు విసుగొచ్చేసింది.
సినిమాల్లో పనిచేయడమంటే ఇంత బోర్‌గా ఉంటుందా అనిపించింది. భవిష్యత్తులో ఎట్టిపరిస్థితుల్లో సినీ పరిశ్రమకు రాకూడదని చాలా గట్టిగా నిర్ణయించుకున్నాను! అయితే, ఎనిమిదో తరగతి దాటాక ఇక చదవడం నా వల్లకాదు అనిపించింది. పరీక్షల్లో వస్తున్న మార్కులు చూసుకుంటుంటే... మా అమ్మ కోరుకున్నట్టు భవిష్యత్తులో చదువు ద్వారా నేనేదీ సాధించలేను అన్న క్లారిటీ వచ్చేసింది అని చెప్పుకొచ్చారు.